Saturday, 28 January 2012


సూర్య నమస్కారం అంటే..? 2

  • విశ్వాసాలు.. వాస్తవాలు...
'తాతయ్యా! మొన్న సూర్య నమస్కారాలు చేసేప్పుడు చెప్పే మంత్రాలకు అర్థాలు చెప్తానన్నారుగా?' పక్కింటి పాప అమూల్య లోపలికి వస్తూనే ప్రశ్నించింది.
'ఆఆ.. చెప్తాను విను.!' 'మిత్రాయ' అంటే 'సర్వజనులకు స్నేహితుడైనవాడా' అని అర్థం. నమః అంటే 'నమస్కారము' అని అర్థం. 'రవయే' అనే పదానికి అర్థం విచిత్రంగా ఉంటుందమ్మా. 'రు-అనే శబ్దము చేత స్తుతించబడువాడా!' అని అర్థం.' 'ఇది అర్థంకాలేదు తాతయ్యా!'
'ఏం లేదమ్మా! హిందూ దేవుళ్ళకి మన పండి తులు ఒక్కొక్కళ్ళకి ఒక్కో అక్షరం లేక శబ్దం సూచించి, ఆ అక్షరం చేసే శబ్దమే వాళ్ళ పేరుగా పరి గణించి ప్రార్థిస్తున్నారు. ఉదాహరణకు 'మా' అనే శబ్దంతో లక్ష్మీదేవిని, 'గం' అనే శబ్దంతో గణపతి లేక వినాయకుణ్ణి ప్రార్థిస్తున్నారు. అలాగే 'రు' అంటే సూర్యుడు అని పెద్దలన్నారు. అర్థమైందా?'
అర్థమైందన్నట్లుగా తల ఊపింది అమూల్య. నేను కొనసాగించాను.
'సూర్యాయ' అంటే 'కార్యక్రమాలను ప్రేరేపించువాడా!' అని అర్థం. పూర్వకాలంలో అన్ని కార్యక్రమాలు, చివరకు యుద్ధాలతో సహా సూర్యోదయంతో ప్రారంభమై, సూర్యాస్తమయం తో ఆపివేయబడేవి. కాబట్టి అన్ని కార్యక్రమాలకు ఆ రోజుల్లో ప్రేరకుడు సూర్యుడే కదా! 'భానవే' అంటే 'కాంతిని కల్గినవాడా' అని అర్థం. అలాగే 'ఖగాయ' అంటే 'ఆకాశంలో సంచరించువాడా!' అని అర్థం. 'పూష్ణే' అనగా 'పోషించువాడా!' అని అర్థం. 'హిరణ్యగర్భాయ' అంటే బంగారము కడుపులో ఉన్నవాడా!' అని అర్థం. ఇది కొంచెం కవిత్వం మేళవించిన పదం. మన కవులూ 'బాలభానుడు బంగారు కిరణాలను ప్రసరిస్తున్నాడు' అంటుంటారు. అంటే ఆయన కడుపులో బంగారం ఉందనీ, అందుకే ఆయన ఉదయం, సాయంత్రాలలో బంగారు కిరణాలు ప్రసరిస్తుంటాడనీ వారి ఉద్దేశ్యం. 'మరీచయే' అంటే 'అంధకారాన్ని పారదోలే కిరణములు కలవాడా!' అని అర్థం. సూర్యోదయంతోటే చీకటి పోతుందిగదా? ఇక 'ఆదిత్యాయ' అంటే 'అదితి కుమారుడా' అని అర్థం. ఆయన తల్లి పేరు అదితి. ఆమె కుమారుడు కాబట్టి ఆయనను 'ఆదిత్యుడు' అని పిలుస్తారు.
అలాగే 'సవత్రే' అనగా 'నిద్రపోయే వాళ్ళను ప్రేరేపించి లేపువాడా' అని అర్థం. 'అర్కాయ' అంటే 'అర్పింపబడువాడా లేక పూజింపబడు వాడా' అని అర్థం. చివరగా 'భాస్కరాయ' అంటే 'కాంతిని కల్గజేయువాడా' అని అర్థం. కాబట్టి ఈ 12 పేర్లూ సూర్యునియొక్క గుణాలను తెలియజేస్తూ, ఆయనను ప్రార్థించేటప్పుడు చెప్పేవి. అర్థమయిందా అమ్మా?'
'అర్థమయింది తాతయ్యా!'
మరో విషయమేమంటే సూర్యునికి ఎదురుగా నిలబడి ఉదయం, సాయంకాలాల్లో మాత్రమే ఈ నమస్కారం చేయాలని అది చేయించే గురువులు చెబుతారు.'
'మరి సూర్యనమస్కారాల వలన ఉపయోగాలేమైనా ఉన్నాయా తాతయ్యా?'
'వాటి గురించి తర్వాత చెప్తాలేమ్మా!'
(వచ్చేవారం సూర్య నమస్కారాల
ఉపయోగాలేమిటో తెలుసుకుందాం!)
'ఈ సూర్య నమస్కారం మధ్యలో ఉచ్ఛరించే మంత్రాల వలన ఉపయోగం ఏముందో నాకూ తెలియదు. కానీ ఆ సమయాల్లో సూర్యుని ప్రత్యేకతలను జ్ఞాపకం చేసుకుంటూ నమస్కరిస్తున్నట్లు భావిస్తున్నాను.
కానీ సూర్యుని 'ఖగాయ' అంటే 'ఆకాశంలో సంచరించేవాడని వర్ణించడం'. ఇది శాస్త్రీయం కాదు. వాస్తవంగా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. భూమి మీద ఉన్న మనకు భూమి చుట్టూ సూర్యుడి తిరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. ఇక రెండో అంశం. 'ఆదిత్యాయనమః' అని సూర్యుని ప్రార్థిస్తూ 'సూర్యుడిని ఒక స్త్రీ కన్నట్లు వర్ణింపబడుతుంది'. భూగోళంలో అన్ని ప్రాణులకు మూలం సూర్యుడు. అందువలన ఈ వర్ణన అశాస్త్రీయం. మిగతా వర్ణనలన్నీ సూర్యుని 'ఒక వ్యక్తి'గా చూపిస్తున్నాయి. కవి వర్ణనలలో ఇది సాధ్యమే కానీ, శాస్త్రీయ దృక్పథం ఇలా ఒప్పుకోదు.
కానీ భంగిమలు మార్చి మార్చి చేసే ఎక్సర్‌సైజుల వలన మాత్రం ఉపయోగముందమ్మా. దానివలన అన్ని అవయవాలలో రక్త ప్రసరణ పెరిగి కీళ్ళు, కండరాలు బలపడుతాయమ్మా. అయితే కీళ్ళు, కండరాల నొప్పులున్నవారు డాక్టర్ల సూచన మేరకే సూర్య నమస్కారం చేయాలి. ఇక తూర్పు, పడమరల వైపు మాత్రమే నిలబడి సూర్య నమస్కారాన్ని చేయాలనడం అశాస్త్రీయం. ఎందుకంటే ఆ ఎక్సర్‌సైజ్‌లు ఎటుతిరిగి చేసినా ఒకే ఫలితాన్నిస్తాయని సైన్సు నిరూపించింది.
'మరి భారతీయులందరూ చేస్తే మంచిదిగా తాతయ్యా?'
'ఎవరి ఇష్టం వారిదమ్మా. ఎవరి నమ్మకం ప్రకారం వారు ఆచరిస్తారు. భారతదేశంలో కొన్ని కోట్ల మంది చంద్రుణ్ణి దేవుడిగా అంగీకరిస్తారుగాని సూర్యుణ్ణి దేవునిగా అంగీకరించరు. వారిని ఈ మంత్రాలతో కూడిన ఎక్సర్‌సైజ్‌లను వారికి ఇష్టం లేకున్నా చెయ్యమనకూడదు గదా? ఉదాహరణకు హిందువులలోనే వైష్ణవులు పూజా కార్యక్రమాలకు ముందు గణేశ పూజ చేయరు. వారు విష్వక్సేనుని పూజతో పూజా కార్యక్రమాలు, క్రతువులు అన్నీ మొదలెడతారు. వారిని గణేశపూజ చేయమని బలవంతపెట్టకూడదు గదా?'
'అవును తాతయ్యా! సూర్యనమస్కారాల గూర్చి నాకు చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్సు తాతయ్యా! వస్తాను.'
'మంచిదమ్మా!'

No comments: