Wednesday 25 January 2012

మూఢనమ్మకాలు ఎందుకున్నాయి ?

మూఢనమ్మకాలు ఎందుకున్నాయి? శాస్త్ర విజ్ఞానం ఒకేలా ఉన్నా అందరూ హేతువాదులు కాదు ఎందుకు? Share విజ్ఞాన వీచిక డెస్క్ Wed, 23 Nov 2011, IST మూఢ నమ్మకాలు ప్రజల్లో ఎందుకుంటాయి? శాస్త్రవిజ్ఞానం ఒకేవిధంగా ఉన్నా అందరూ ఎందుకు హేతువాదులు కాదు? తాను అనుకున్న దానినే గుడ్డిగా (మూర్ఖంగా) నమ్మే వ్యక్తికి మూఢనమ్మకం ఉందంటాము. ఎవరూ పనిగట్టుకొని గుడ్డిగా దేన్నీ నమ్మరు. ఏదో ఒక హేతువు ఆధారంగానే మూఢ నమ్మకస్తుడూ నమ్ముతుంటాడు. కాబట్టి ప్రపంచంలో ఎవరూ పదహారణాల మూఢనమ్మక స్తులు కాదు. అదేవిధంగా విశ్వాసానికి, నమ్మకానికి ఆధారాన్ని ఆపాదించుకునే వ్యక్తిని హేతువాది అంటాము. ఈ ప్రపంచంలో ఏ ఆధారమూ, ఏ హేతువూ లేకుండా ఏ వ్యక్తీ ఒక నమ్మకాన్ని ఏర్పర్చుకోడు. అంటే అర్థం ఏమి టంటే వైద్యపరంగా పిచ్చివాళ్లు తప్ప ఆరోగ్యంగా ఉన్న ప్రతివ్యక్తీ ఏదోవిధంగా హేతువాదే! మరి ఎందుకని కొందర్ని హేతువాదులనీ మరి కొందర్ని (నిజం చెప్పాలంటే ప్రజానీకంలో అధికభాగంగా ఉన్నవారిని) మూఢనమ్మ కస్తులనీ, ఛాందసవాదులనీ, అంధవిశ్వాసులనీ ముద్ర వేస్తున్నాము? కేవలం శాస్త్రం ఆధారంగా ఏర్పడ్డ హేతువాద దృక్పథపు మోతాదుకూ, అశాస్త్రీయ ఆధారాలతో ఏర్పడ్డ నిర్హేతుక నమ్మకాల మోతాదుకూ ఉన్న నిష్పత్తిని బట్టే కొందరు హేతువాదులుగానూ, మరికొందరు ఛాందసవాదులుగానూ పరిగణింపబడుతున్నారు. నిజమైన హేతువాదులు పరస్పర విరుద్ధమైన అభిప్రాయా లతో ఉండరు. పరస్పర విరుద్ధ ఆధారాలపైన తమ నమ్మకాల్ని నిలబెట్టుకోరు. కానీ నిర్హేతుకవాదులు, మూఢనమ్మకస్తులకు హేతువు ఉంటుందిగానీ ఆ హేతువులు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. మూఢవిశ్వాసంలో ఉన్నవాడు కూడా కొంత దూరం హేతువుతో వెళతాడు. కానీ ఈయనకు నిన్న ఒక హేతువు, నేడు ఒక హేతువు, సమయానుకూల హేతువులు ఉంటాయి. ఉదా: కింది సంభాషణ గమనించండి. అద్భు తాల్ని గట్టిగా విశ్వసించే ఒకవ్యక్తి (అద్భుతాల విశ్వాసి) సంధించిన ప్రశ్నలకు ఒక మూఢవిశ్వాసి, ఒక హేతువాది ఎలా స్పందిస్తారో కింది ఉదాహరణలో గుర్తించండి. అద్భుతాల విశ్వాసి : రాయి నీళ్లలో ఎందుకు మునిగింది? (ప్రశ్న) మూఢ విశ్వాసి : బరువున్నవి నీళ్లలో మునుగుతాయి. తేలికైనవి తేలతాయి. (హేతువు) అద్భుతాల విశ్వాసి : మనిషి మునుగుతాడా? (ప్రశ్న) మూఢ విశ్వాసి : మునుగుతాడు. ఆ మధ్య చాలామంది విద్యార్థులు గోదాట్లో ఈతకెళ్లి మునిగిపోయారు కదా! (హేతువు) అద్భుతాల విశ్వాసి : మనుషులందరూ దాదాపు ఒకటే కదా! అంటే శరీరధర్మాలు, శరీర నిర్మాణం మొదలైన విషయాల్లో! మూఢ విశ్వాసి : అవును. అందర్లోనూ రక్తం ఉంది. అందరూ అన్నమే తింటారు. కొందరు రాళ్లు తినరు. అందరూ కళ్లతోనే చూస్తారు. నోటితోనే తింటారు. కొందరు నోటితో, మరికొందరు చెవులతో భోంచేయరు కదా! (హేతువు) అద్భుతాల విశ్వాసి : మరి ఆ మధ్య మన ఊరి చెరువులో ఓ వ్యక్తి ఏమాత్రం ఈత కొట్ట కుండా, కాళ్లాడించకుండా, చేతులు కదిలించకుండా గంటసేపు నీళ్లపై వెల్లికిలా పడు కొని తేలాడుతూ ఉన్నప్పుడు మన ఊరి వారందరూ అతనికి గొప్ప నైవేద్యాలు ఇచ్చారు. మీరు కూడా అందులో ఒకరు. అతనెలా మునిగిపోలేదు? (కారణం ఏమిటన్న ప్రశ్న) మూఢ విశ్వాసి : అతనికి మహిమలున్నాయి. అతడు ప్రత్యేకం. అందరిలాంటివాడు కాదు. దైవాంశసంభూతుడు. అందుకే అందర్లా మునిగిపోకుండా తేలగలిగాడు. (ప్రశ్నకు సమా ధానం ఇవ్వడం హేతువే. ఆ మేరకు ఈ మూఢవిశ్వాసి హేతువాదే! కానీ అశాస్త్రీయమైన ఆధారాన్ని హేతువుగా భావించాడు). పై ప్రశ్నల్లో చివరిది తప్ప మిగిలిన ప్రశ్నలన్నింటికీ ఓ నిజమైన హేతువాది కూడా అవే సమాధానాలిస్తాడు. కానీ చివరి ప్రశ్నకు మాత్రం హేతువాది ఇలా జవాబిస్తాడు. ఇతనికి శాస్త్రం తెలియకపోవచ్చును. కానీ శాస్త్రీయ దృక్పథం ఉన్నవాడు. హేతువాది: అలా తేలియాడుతున్న వ్యక్తులు నిజంగానే మిగిలిన వ్యక్తులతో పోలిస్తే భిన్నంగా ఉంటారు. మిగిలిన వ్యక్తుల్లాగా ఆ వ్యక్తులు మునిగిపోకుండా తేలుతూ ఉండడం కూడా నిజమే. కానీ అందుకు కారణం వాళ్లకి మహిమలుండడం కాదు. ఏదో శాస్త్రీయ ఆధారం ఉండే ఉంటుంది. నాకైతే తెలీదుగానీ వీరు తేలడానికి మహిమలైతే కారణం కాదు. ఎందుకంటే మహిమలు అంటూ ఎవరి దగ్గరా లేవు. వీళ్లు అందరిలాగా మునగట్లేదు. కానీ వీరు అందరికంటే భిన్నంగా ఉన్నారు. అదే తేడా. మునగకపోవ డానికీ వారికున్న ఊబకాయానికీ ఏదైనా సంబంధముందేమో! (హేతువు చూడగలగడం, ఆ హేతువు నిజ భౌతిక ప్రపంచపు పరిశీలనల ఆధారంగా ఏర్పడడం మనం ఇక్కడ చూస్తాము). ఇదే ప్రశ్నను శాస్త్రం తెలిసిన వ్యక్తి (ఉదా: జెవివి కార్యకర్త) ఇలా జవాబిస్తాడు. జెవివి కార్యకర్త: వీరు అందర్లాగా మునిగి పోలేదన్నది వాస్తవం. అందర్లాగే శరీరధర్మా లు ఉండడమూ వాస్తవమే. అయితే వీరు ఊబకాయులు. వీరి ఊబకాయానికి కారణం శరీరంలో పేరుకుపోయిన కొవ్వు. కొవ్వుకు నీటికన్నా తక్కువ సాంద్రత ఉంటుంది. కాబట్టి వీరి నికర సాంద్రత మిగిలినవారి సాంద్రత కన్నా కొంచెం తక్కువ. వీరి ఎముక నిర్మాణం అందర్లాగే ఉంటుంది. కాబట్టి వీపు మీద కొవ్వుతో కూడిన కండర కణజాలం వెన్నెముకకు అటూ యిటూ కాలవగట్టులాగా ఉంటుంది. వీరు బోర్లా కాకుండా జాగ్రత్తగా వెల్లకిలా నీటిపైన బల్లపరుపుగా పడుకో వడం వల్ల వీపుమీద ఉన్న గాడి (groove) కి, నీటికి మధ్య గాలిబుడగ ఏర్పడుతుంది. ఇది వారిని తేలేలా చేస్తుంది. పైగా వీరి సాంద్రత ఇతరులకంటే తక్కువ. ఈ రెండింటి ఫలితంగా వీరు ఈతకొట్టకున్నా తేలగలుగుతున్నారు. ఇదే వ్యక్తులు నిలువుగా నిల్చో లేరు. మునిగిపోతారు. బోర్లాపడుకొని తేలలేరు. మునిగి పోతారు. నేను ఛాలెంజ్‌ చేస్తాను. కావాలంటే ప్రయోగంచేసి చూడండి. మహిమలే ఉంటే వీరు ఏ భంగిమలో నీళ్లలో నిలబడ్డా మునగకూడదు. ప్రజల్లో ఉన్న పరిమితజ్ఞానాన్ని, అద్భుతాలపైగల విశ్వాసాల్ని ఆధారం చేసుకొని వారిని మోసం చేస్తూ కొందరు డబ్బులు కూడబెట్టుకొంటున్నారు. అలాగే సముద్రపు నీటిలో ఇలా తేలడం మరింత సులువు. దీనికి కారణం ఈ నీటిలో ఉప్పు శాతం ఎక్కువ వుండడంతో దీని సాంద్రత మామూలు నీటి కన్నా ఎక్కువగా ఉండటమే. అందుకే మృతసముద్రం (డెడ్‌ సీ)లో అక్కడి ప్రజలు ఇలాగే నీటిలో పడుకుని దినపత్రిక చదువుకుంటారంట. ఒకవైపు దేవుడి సృష్టి అద్భుతం, అందమైన విశ్వం అంటూనే వారానికి రెండు రోజులు మంచివికావని, దుర్ముహూర్తాలనీ, మంచిరోజులనీ, రాహూకాలమనీ, చెడ్డదిక్కులనీ, పదార్థాల, కాలాల ఆంతరంగిక లక్షణాలకు బయట ఉన్న సార్వత్రికత (universality) కు రంగుల్ని పూస్తారు. అశాస్త్రీయ కారణాల్ని హేతువులుగా చూపుతారు. పాఠ్యపుస్తకాల్లోనూ, తరగతిగదుల్లోనూ ఒకే విధమైన ప్రకృతి సూత్రాల్ని నేర్చుకొనే విద్యార్థులందరికి ఆ ప్రకృతిసూత్రాల పరిజ్ఞానంతో అబ్బవలసిన హేతువాద దృక్పథం, శాస్త్రీయ తత్పరతకన్నా అధికమోతాదులో అజ్ఞానాన్ని, అంధకారాన్ని, భయాన్ని, ఆందోళనలనూ, అభద్రతనూ, అశాస్త్రీయతనూ, అసమానతా భావాలనూ, ఛాందస త్వాన్నీ, వివక్షనూ, వైషమ్యాల్నీ నేర్పించే పరిస్థితులు సమాజంలో ఉన్నాయి. తరగతిగదుల్లోనూ సరైన శాస్త్రీయ విద్య ఉండడం లేదు. పాఠాలు బోధించే సైన్సు టీచర్లలో చాలామందికి వాస్తు, జ్యోతిష్యం, బాబాల భక్తి, మహిమలు, మంత్రతంత్రాలు, పునర్జన్మ, కర్మ, ముహూర్తాలు, జాతకాలు అంటూ మూఢవిశ్వాసాలు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రయోగశాలల్లేని సైన్సు తరగతిగదుల్లో శాస్త్రీయవిద్య ఎలా వీలు పడుతుంది? బడిలో చేరకముందే భయాలనూ, దయ్యాలనూ పరిచయం చేసే కుటుంబ సామాజికవ్యవస్థలో మనం ఉన్నాము. అందుకే వృత్తిపరంగా ద్రవ్యశక్తి నితృత్వ సూత్రాన్ని ప్రబోధించే భౌతికశాస్త్ర ప్రొఫెసర్లే సత్యసాయిబాబా శూన్యం నుంచి బంగారు నగల్ని సృష్టించడాన్ని ప్రశ్నించడం లేదు. పైగా అది మహిమ అంటూ శ్లాఘిస్తున్నారు. ఈ విశ్వంలో కొలతలకు వీలుగాని అంశం అంటూ ఏదీ లేదు. ఏ దృగ్విషయమైనా ద్రవ్యరాశి (mass), స్థలం (space), కాలం (time), విద్యుత్ప్రవాహం (current) అనే అక్షరమాలలో ఒదగాల్సిందే. కానీ 'మహిమ' అనే రాశికి ఏ కొలతలుండవు. కాలం ఉండదు. స్థలం ఉండదు. సంఖ్యామానం ఉండదు. ప్రయోగ నిర్ధారణ కూడా ఉండదు. వేదనను మర్చిపోవడానికి పేదవాడు ఏదో ఒక ఆధారాన్ని ఆసరా చేసుకొని సంభాళించు కొంటాడు. పాలకోసం ఏడ్చే పసిబిడ్డకు పాలకు బదులు ప్లాస్టిక్‌ పీకను నోటికిచ్చి, దాన్నే తల్లిపాలిండుగా భావించమంటూ మోసం చేసినట్లే సర్వజ్ఞానానికీి, సుఖసంతోషాలకూ, సంపూర్ణ మానవీయ వికాసానికీ అర్రులు చాచే ప్రజాబాహుళ్యానికి మూఢవిశ్వాసాలనూ, ఛాందసత్వాన్నీ, కర్మవాదాన్నీ దోపిడీవర్గం అలవాటు చేసి, అందులోనే సుఖప్రాప్తి పొందమంటూ మోసం చేస్తుంది

No comments: