Wednesday, 25 January 2012

నిమ్మతో ఆరోగ్యం


నిమ్మతో ఆరోగ్యం

నిమ్మకాయ సుగుణాలు తెలియనివారుండరు. అవి చాలామందికి సుపరిచితమే. వంటింట్లో వంటకాలకు రుచిని అందివ్వటమే కాదు, సౌందర్య సాధనంగా కూడా నిమ్మకాయ ఉపయోగపడుతుంది. అన్ని ఋతువులలో లభించే నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా వుంటుంది. ఖనిజ లవణాలు ఎక్కువగా వుండే నిమ్మకాయ, శరీరంలోని విష పదార్థాలను బయటకు తీసుకునిపోవడంలోనూ సహాయం చేస్తుంది. నిమ్మకాయ షర్బత్ కడుపులోని ఇబ్బందులను తొలగిస్తుంది. ఉదయమే పరగడుపున రెండు గ్లాసుల నిమ్మకాయ రసం తాగితే ఎంతో కాలంగా పీడిస్తున్న అజీర్ణం పోతుంది. వాయు సమస్యలూ, ఆకలి లేకపోవడం వంటి వాటిని దూరం చేస్తుంది. తెల్ల జీలకర్ర, నిమ్మరసం సైంధవ లవణం కలిపి ఎండబెట్టి పొడి చేయాలి. దీని 3 గ్రాముల చొప్పున తీసుకుంటే, జీర్ణశక్తి పెరుగుతుంది. ముఖానికి నవ్వే అందం అంటారు. మరి ఆ అందానికి మూలకారణమైన పలువరుసలు చక్కగా వుండి దంతాలు తెల్లగా మెరవాలంటే అర టీ స్పూన్ వేప పొడి, ఉప్పు, 1 టీస్పూన్ చక్కెర పొడి, పావు టీ స్పూన్ కర్పూరం పొడి, నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి వారానికి రెండుసార్లు పళ్లు తోముకుంటే చిగుళ్లకు బలం కలగటంతోపాటు దంతాలపైన గార కూడా పోతుంది. ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం కలిపి దాంతో పుక్కిలిస్తుంటే కొన్నిరోజులకు దుర్వాసన పోతుంది.
కొందరికి విపరీతంగా ఎక్కిళ్లు వస్తుంటాయి. అలాంటప్పుడు 2 గ్రాముల నిమ్మరసంలో 2 గ్రాముల తేనె కలిపి తీసుకుంటే ఆ ఎక్కిళ్లు ఆగిపోతాయి. అజీర్ణం అయినపుడు నిమ్మ, అల్లపు రసాలను సమానంగా కలిపి ఒకో చెంచా చొప్పున ఉదయం, సాయంకాలం తీసుకుంటే సరిపోతుంది. 5 గ్రాముల నిమ్మరసం, 15 గ్రాముల సున్నపు నీటి తేట, 2 గ్రాముల వాము పొడి, 10 గ్రాముల తేనె తీసుకుని బాగా కలపాలి. మూడు పూటలా ఈ మిశ్రమాన్ని తీసుకుంటే కడుపులో పురుగులు పోతాయి. లవంగాల పొడి, తేనె, నిమ్మరసం కలిపి పళ్లకూ, చిగుళ్లకూ రాస్తే పళ్లనొప్పి తగ్గుతుంది. నిమ్మరసంలో సైంధవ లవణం కలిపి కొన్నాళ్లపాటు తీసుకుంటే మూత్రపిండాలలోని రాళ్లు కరిగిపోతాయి. 1 గ్లాసు వేడి నీటిలో సగం నిమ్మ చెక్క పిండి, చిటికెడు ఉప్పు కలిపి పుక్కిలిస్తే గొంతు నొప్పి పోతుంది. గ్లిజరిన్‌లో నిమ్మరసం కలిపి కొన్నాళ్లుపాటు పెదవులకు పూసుకుంటే పగిలిన పెదవులు మెత్తబడి కోమలంగా తయారవుతాయి. దోమలు కుట్టిన చోట నిమ్మరసం రాసుకుంటే మంట తగ్గుతుంది. కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి దురదలున్న చోట పూస్తుంటే వారంలో అవి పోతాయి.
సౌందర్య సాధనంగా...
అర టీ స్పూన్ నిమ్మరసంలో 5 చుక్కల తేనె, 1 టీ స్పూన్ బార్లీపొడి కలిపి ముఖానికి రాసుకుని ఐదు నిముషాల తరువాత కడిగేయాలి. నిమ్మరసం ముఖ చర్మంలో అదనపు జిడ్డును తొలగిస్తుంది. నిద్రలేమివల్ల కళ్లకింద ఏర్పడే వలయాలను పోగొడుతుంది నిమ్మకాయ. 2 టీ స్పూన్‌ల దోసగింజల పొడికి, అర టీ స్పూన్ నిమ్మరసం, తగినన్ని పాలు పోసి దీన్ని కళ్లకింద రాసుకుని ఆరిపోయిన తరువాత కడిగేయాలి. కళ్లకింద నల్లదనం పోగొట్టటంతోపాటు, చర్మాన్ని మృదువుగా చేసే గుణమూ దీనికి వుంది. వనంలోనే కొందరికి చర్మం వదలైపోయి, వార్థక్యం వచ్చినట్లుగా కనిపిస్తుంటుంది. అలాంటివారికి చక్కని వైద్యం చేస్తుంది నిమ్మకాయ. అర కప్పు తొక్క తీసిన బంగాళా దుంప తురుము, అర టీ స్పూన్ నిమ్మరసం, 1 టీ స్పూన్ ఎర్ర చందనం వీటిని వేడి నీటిలో కలిపి పేస్టులా చేయాలి. ముఖంమీద శుభ్రమైన, పలుచని మస్లిన్ బట్టను మూసుకుని, దాని మీద ఈ పేస్టు ముఖమంతా పట్టించాలి. అరగంట తరువాత బట్ట తీసేసి ముఖం కడుక్కోవాలి. ముఖ చర్మానికి వన శోభ కలగుతుంది. నిమ్మ ఆకులతో నేచురల్ ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు. 4 నిమ్మఆకులు, 1 టీ స్పూన్ చొప్పున పెసరపప్పు, పెరుగు, అర టీ స్పూన్ కస్తూరి పసుపు వీటిని రుబ్బుకుంటే చక్కని నేచురల్ ఫేస్ ప్యాక్ తయారవుతుంది. దీంతో ముఖానికి ప్యాక్ వేసుకుని పది నిముషాల తరువాత కడిగేయాలి. 4 తులసి ఆకులు, 4 వేపచిగుళ్లు, 1 టీ స్పూన్ సెనగపిండి, అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి మొటిమల మీద రాసి ఐదు నిముషాల తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. చర్మం మృదువై మొటిమలు పోతాయి. -సుబ్బలక్ష్మి

No comments: