Wednesday 25 January 2012

నీటికి రుచి లేదా?-విజ్ఞాన వీచిక డెస్క్ Wed, 18 Jan 2012,


MONDAY, JANUARY 23, 2012


నీటికి రుచి లేదా? Share విజ్ఞాన వీచిక డెస్క్ Wed, 18 Jan 2012, IST మా పాఠ్య పుస్తకాలలో 'నీరు' పాఠంలో నీటికి రంగు, రుచి లేనట్లు రాశారు. రంగు లేకపోయినా మనం తాగే నీరు కొంత రుచిగా అనిపిస్తుంది కదా! మరి నీటికి 'రుచి' లేదనడం ఎంతవరకు సబబు? - ఎ.భరత్‌, పొదలకూరు, నెల్లూరుజిల్లా స్వచ్ఛమైన నీటికి మాత్రమే రంగు, రుచి లేవు. మనం తాగే నీరు రసాయనికంగా స్వచ్ఛమైనది కాదు. మన శరీరానికి నీటితో పాటు పలురకాలైన లవణాలు (minerals) కూడా అవసరం. ఉదాహరణకు మన మెదడు, నాడీ మండలం, కణజాలాల మధ్య పదార్థాల రవాణా (material transport) వగైరా పనులన్నీ వివిధ లోహ అయాన్ల (metal ions) సమక్షంలో జరుగుతాయి. ఉదాహరణకు నాడీతంత్రుల మధ్య సమాచార సరఫరా (communication propagation) లో సోడియం (Na+), పొటాషియం (K+) క్లోరైడు (Cl-) వంటి అయాన్ల ప్రమేయం అధికంగా ఉంటుంది. ఈ అయాన్లు అసమానంగా కణాల మధ్య పేరుకుపోయినపుడు ఏర్పడే విద్యుత్‌ పొటెన్షియల్‌ ఓ సంకేత రూపంలో నిలువ ఉంటుంది. తిరిగి ఈ అయాన్ల గాఢత సమానమయినపుడు ఆ సంకేతం పక్క కణానికి చేరుతుంది. ఇలా పదే పదే అయాన్ల గాఢతల మధ్య అసమాన, సమానత్వాలు రావడం వల్లే మెదడు నుంచి కణజాలాల (tissues) వరకూ సంకేతాలు (signals) చేరతాయి. మన రక్తంలో ఎర్ర రక్తకణాలలోని ఇనుము అయాను ఎంతో విశిష్టమైంది. మనం పీల్చిన గాలిలోని ఆక్సిజన్‌ హీమోగ్లోబిన్‌లోని ఇనుము అయానుతోనే సంధానించు కొంటుంది. అది రక్తప్రసరణ ద్వారా కణాలను చేరినపుడు అక్కడ మయోగ్లోబిన్‌లో ఉన్న ఇనుము అయానుకు బదలాయించు కొంటుంది. ఆ తదుపరి సైటోక్రోమ్‌ - c - ఆక్సిడేజ్‌ అనే మరో లోహ ప్రోటీను సమక్షంలో ఆక్సిజన్‌, హైడ్రోజన్‌ అయాన్లు కలిసి నీటి ఆవిరిగా మారే క్రమంలో శక్తి విడుదలవుతుంది. ఆ శక్తినీ మనం గ్రహించి, వివిధ జీవధర్మాలను చేయగలుగుతున్నాము. ఇప్పుడు మీరు ప్రజాశక్తి చదువుతున్న సందర్భంలో మీ కంటిలోనూ, మెదడులోనూ సైటోక్రోమ్‌ - c - ఆక్సిడేజ్‌కి పని పడిందన్న మాట. ఈ సైటోక్రోమ్‌ - c - ఆక్సిడేజ్‌లో జింకు, ఇనుము, కాపర్‌ అయాన్లు ఉంటాయి. ఇలా ఎన్నో అయాన్లు మన శరీరంలో తమ తమ వంతు కర్తవ్యాలను నిర్వహించడంవల్లే మనం సజీవంగా ఉన్నాము. మరి ఈ అయాన్లు మన శరీరంలోకి ఎలా వెళ్లాలి? మన తినే ఆహారంలోను, కాయగూరల్లోను, పండ్లల్లోను కొంతమేరకు పలురకాల అయాన్లు ఉన్నా ఎక్కువ శాతం అయాన్లు తాగే నీటి ద్వారానే శరీరానికి అందుతాయి. కాబట్టి స్వచ్ఛమైన నీరు (pure water) మనకు దాహాన్ని తీరుస్తుందేగానీ ఉపయుక్త మైన లవణాలను అందించలేదు. అందు వల్ల మనం తాగేనీటిలో కృత్రిమంగాగానీ లేదా సహజంగాగానీ కొన్ని లవణాలు ఉండేలా చూస్తాము. ఇలా లవణాలు కరిగిననీరు కాబట్టే అలాంటి నీటికి కొంత రుచి ఉన్నట్టు తోస్తుంది. వివిధ ప్రాంతాల్లోని నీటిలో వివిధ రకాలయిన సహజ లవణాలు పలు మోతాదుల్లో ఉండడం వల్ల ప్రాంతాలను బట్టి తాగునీటి రుచి మారుతుంది. లవణాలు తగురీతిలో ఉండాలన్న నిబంధనను అనుసరించే మనము ప్రభుత్వాలను రక్షిత మంచినీరు (safe drinking water) సరఫరా చేయాలని అడుగుతున్నాం. కానీ ప్రభుత్వాలు చేతులెత్తేయడం వల్ల బహుళజాతి కంపెనీలు, దగా కంపెనీలు, బూటకపు కంపెనీలు మినరల్‌ వాటర్‌ అంటూ ప్రజల నుంచి కోట్లు దండుకుంటున్నాయి.

No comments: